మన గౌరీ పుత్రులకి నమస్కారం , మన గవర కులస్థులు గౌరీ దేవి అంశతో జన్మించారని ,అందువలన గౌరీయులు అంటారని మన పెద్దలు చెబుతుంటారు . మన గవర పుత్రులు ఎక్కడ ఉన్నా గౌరీ పరమేశ్వరుల పూజ చేయడం ఆనవాయితి . పూజా విదానం వారి నివసించే ప్రదేశాలను బట్టి మారుతుంది . దీపావళి అమావాస్య ముందు వచ్చే పౌర్ణమిని గౌరీపౌర్ణమి అంటారు . గౌరీ పౌర్ణమి నాడు మన కుల పెద్దలు ఎంపిక చేసిన ( బాగుగా పండిన ) వరి పొలంలో ఒక దుబ్బుని తీసి కుండిలో పెట్టి , నవధాన్యాలు వేసి మట్టితో నింపుతారు . దుబ్బు తీసిన చోట పైకం ముంచుతారు . ఈ తతంగమంతా ముతైధువలు సమక్షంలో ముతైధువలే నిర్వహిస్తారు . ఈ వ్యవహారమంతా ఒక నదీతీర ప్రాంతములోనో లేదా వరి చేనుకు దగ్గర గల బావి చెంతనో జరుగుతుంది . పూజా విధానం పూరైన పిమ్మట మన గౌరీ ముతైధువులు గాని పది సంవత్సరాలు నిండని గౌరీ పుత్రికలు గాని నెత్తి మేద పెట్టుకొని పురవీదులలో భాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా తీసుకొని వచ్చి పూజా మండపంలో దిష్టితీసి , హరతిచ్చి మరి కూర్చోబెడతారు . ఈ పూజా విదానమంతా మన గౌరీ పెద్దల సమక్షంలో గౌరీ బాలికల చేత చేయించడం జరుగుతుంది . తరువాత వారం , పది రోజులలోపు అమ్మవారిని తీసుకువచ్చి పూజ ప్రారంభమవుతుంది . అమ్మ వారి విగ్రహం కోసం ప్రత్యేకమైన పీట తయారుచేయిస్తారు . పీట మేద విగ్రహం తయారుచేయిస్తారు . శిల్పి కి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు స్వయంపాకం ( బియ్యం , పప్పు , చింతపండు , అరటికాయ ,తోటకూర , ఎండు మిరపకాయలు , చిమ దుంప , పెండ్లం , వంకాయ , గుమ్మడి ముక్క , వగైరాలు ) రొక్కం ఇవ్వడం ఆనవాయితి .అమ్మవారిని నెత్తి మేద పెట్టుకొని ఊరేగిస్తూ మండపంలో నిల్పుతారు . కొన్ని ప్రదేశాలలో జగమయ్య పూజ చేస్తారు . సాయంత్రం గొబ్బీలుపాట పాడతారు ., రాత్రి పూట చిడతాలు ఆడతారు . సంధర్బాన్ని బట్టి సారె మహోత్సవం , అన్నధాన కార్యక్రమం , కుంకుమ పూజలు , ప్రత్యేక దీపారాధనలు ,వివిధ సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది . సమయాన్ని బట్టి అనుపు మహోత్సవం నిర్వహిస్తారు . ఈ పూజా విధానం జరుగుచున్న రోజులు ఒంటి పూట శాకాహరం ,టిఫిన్ ( కొన్ని చోట్ల ఉల్లిపాయ కలపకుండా ) వారే స్వయంగా వండుకొని , భోజనం చేస్తారు . మొత్తం కార్యక్రమం అయిన తరువాత అప్పటివరకు ఆస్థానంలో ఉన్న పూజారమ్మని ముస్తాబు చేసి ఇంటికి పంపండంతో గౌరీ పూజ పూర్తి అవుతుంది . మన గౌరీ సాంప్రదాయాలు కనుమరుగై , కాల గర్బంలో కలిసిపోతున్న ఈ రోజులలో ,నేటి తరానికి తెలియ జేసే చిన్న ప్రయత్నం ఈ చిన్న వ్యాసం . ప్రదేశాలని బట్టి మార్పులు ,చేర్పులు ఉంటాయి . మన ఆచార , వ్యవహారాలు మన తరువాతి తరానికి తెలియజేద్దాం . మన సంస్క్రతి సాంప్రదాయాలను కాపాడుదాం…..
శరగడం రామ సింహాచలం నాయ్ఢు , కటక్ (ఒడిస్సా )